
అక్కినేని నాగార్జున ప్రస్తుతం వయస్సు 66 సంవత్సరాలు, కానీ ఆయన గురించి తెలియనివారెవరయినా ఆయనను చూస్తే 40-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని అనుకుంటారు. వాస్తవానికి, ఇప్పుడు నలభయ్ సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు చాలా మంది కంటే ఆయన చిన్నవారిలా కనబడుతున్నారు. నాగార్జున కొన్ని దశాబ్దాలుగా చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ, ప్రతి రోజూ వ్యాయామం చేయటం,వలన ఆయన వయస్సు శరీరాకృతిలో కనిపించటం లేదు.
ఈ సంవత్సరం నాగార్జున నటించిన “కూలీ” చిత్రం లో ఆయన లుక్, స్టైల్ తమిళ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. యువత ఆయన స్టైల్ ను, ఫాషన్ ను అనుకరిస్తూ వీడియోలు చేసారు. యువతులు కొన్ని వీడియోలలో ఆయనను తమ క్రష్ గా చెప్పుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లు చెన్నైలో జరిగినప్పుడు, మీడియా వాళ్ళు, యాంకర్లు మాత్రమే కాక సెలిబ్రిటిలు సైతం ఆయనను చూసి ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం నాగార్జునను చాలా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇటీవల చెన్నైలో జరిగిన జియో హాట్ స్టార్ వాళ్ళ ఈవెంట్ కి నాగార్జున, మోహన్ లాల్ , విజయ్ సేతుపతి గెస్టులుగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో మోహన్ లాల్ ముందే నాగార్జునను విజయ్ సేతుపతి పొగడ్తలతో ముంచెత్తాడు.
తాను చిన్నప్పుడు మొట్ట మొదటి సారి నాగార్జునను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, ఇప్పటికి సరిగ్గా అలాగే ఉన్నాడు. ఈయనకు వయస్సు ఎందుకు పెరగటం లేదో నాకు అర్ధం అవటం లేదు. కాబట్టి ఎవరయినా ఆయన గ్లామర్ రహస్యాన్ని కనిపెట్టడానికి రీసెర్చ్ స్టడీ చేస్తే బాగుంటుంది. చాలా సంవత్సరాలుగా నాగార్జున హెయిర్ స్టైల్ కూడా అలాగేఉంది, ఆయన ఎనర్జీ లెవెల్స్ లో కొంచెం కూడా తగ్గలేదు. నేను ముసలివాడ్ని అయ్యిపోయి నా మనవళ్లు , ముని మనవళ్లు వచ్చినా ఈయన ఇట్లానే ఉంటారేమో !? ,అని విజయ్ సేతుపతి చెప్పగానే , ప్రేక్షకులతో నిండిపోయిన ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. నాగార్జున ఈ పొగడ్తలకు చిన్న చిరునవ్వుతో బదులిచ్చాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు చాలా సీజన్స్ కి నాగార్జున హోస్టుగా ఉన్నారు. తమిళ్ బిగ్ బాస్ నుండి కమల్ హాసన్ తప్పుకున్న తరువాత, విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.