Home Blog చిరంజీవిని కలవటానికి వెళితే లుంగీ మామ టీమ్ కి ఏం జరిగిందో తెలుసా..?

చిరంజీవిని కలవటానికి వెళితే లుంగీ మామ టీమ్ కి ఏం జరిగిందో తెలుసా..?

0

కే రాంప్ సినిమాలో “ఇదేమిటమ్మా మాయ మాయ” పాటకు డాన్స్ చేసిన లుంగీ మామ టీమ్

ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కే రాంప్ సినిమాలో ఒక డాన్స్ బిట్ వీడియో వైరల్ అయ్యింది. హీరో కిరణ్ అబ్బవరం తో కలిసి నెల్లూరు లుంగీ మామ చేసిన “ఇదేమిటమ్మా మాయ మాయ” పాట సినిమా విజయానికి ఎంతో ఉపయోగపడింది. ఈ పాట గతంలో Dr.రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోది. ఈ పాటలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు అయిన ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ వీడియోలలో పాపులర్ అయినా లుంగీ మామ టీం హీరోతో కలిసి డాన్స్ చేయటంతో, ఈ పాట విపరీతంగా వైరల్ అయ్యింది.

నెల్లూరు లుంగీ మామ అసలు పేరు వెంకటరమణ. ఈయనది మత్స్యకారుల కుటుంబం. నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్నప్పుటినుండి డాన్స్ అంటే పిచ్చి. పాట వినిపిస్తే చాలు డాన్స్ వేయాల్సిందే. ధ్యాసంతా డాన్స్ మీద ఉండటంతో, చదువు మీద ఆసక్తి ఉండేది కాదు, స్కూకి వెళ్ళేవాడు కాదు. అందుకే చదువు అబ్బలేదు. తన బాబాయ్ గోవింద్ ఇచ్చిన ప్రోత్సహం తో డాన్స్ లోని మెళకువలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు.

లుంగీ మామకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప 10 వ తరగతి చదువుతుంది. కులవృత్తి అయినా చేపలవేటలో వచ్చే డబ్బులు కుటుంబాన్ని పోషించుకోవటానికి సరిపోయేవికావు. ఒక ఆటో తీసుకొని, కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవింగ్ వృత్తిని చేపట్టాడు లుంగీ మామ.

లుంగీ మామ గ్రామానికే చెందిన మున్నా – నరేందర్ కలిసి రీల్స్ చేసేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు వచ్చి కలిసి రీల్స్ చేద్దామని అడిగారు. మిగతా రోజులు పని చేసుకున్నా ఆదివారాలు మాత్రం రీల్స్ చేయటానికి లుంగీ మామను ఒప్పించారు. వీళ్ళు కలిసి చేసిన మొదటి రీల్ కే 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దానితో ఆదివారాలు రీల్స్ చేయటం ప్రారంభించారు. లుంగీ పైకి కట్టి..చెప్పులతో..రోడ్ పక్కన ఆయన వేసే స్టెప్స్ , సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయనను గూర్చి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి కలిగింది. హఠాత్తుగా కిరణ్ అబ్బవరం తో కలిసి “కే రాంప్” సినిమాలో వేసిన స్టెప్స్ వైరల్ కావటంతో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతున్నారు.

లుంగీ మామ టీం మొత్తం మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు. ఒకసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రంలో స్క్రీన్ టెస్ట్ కోసం వీళ్ళను హైదరాబాద్ కు పిలిపించారు. స్క్రీన్ టెస్ట్ అయినతరువాత చిరంజీవి ఇల్లు ఆ పక్కనే ఉంది అని తెలిసింది. అభిమానులు కావటంతో ఆయన ఇంటి గేట్ దగ్గరకు వెళ్లి సెక్యూరిటీ వాళ్ళకి, చాలా దూరం నుండి వచ్చామని, చిరంజీవి అభిమానులం అని, ఆయనను కలవాలని రిక్వెస్ట్ చేసారు. అయితే చిరంజీవి ఆ సమయం లో ఇంట్లో లేరు, కాబట్టి కలవటం వీలు పడలేదు. అయితే వీళ్ళు నిరుత్సహపడకుండా చిరంజీవి ఇంటి గేట్ ముందు చిరంజీవి పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఒక రీల్ చేసారు. ఆ రీలుకూడా విపరీతంగా వైరల్ అయ్యింది. చిరంజీవిని ఎప్పటికయినా కలవాలని వీళ్ళ ఆశ, ఇప్పటికి తీరక పోయిన, ఎప్పటికయినా ఆయన దృష్టికి వెళితే, కలిసే అవకాశం వస్తుందేమో చూడాలి.

లుంగీ మామ టీం అంతా చాల పేదవాళ్ళు. హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాలకోసం ప్రయత్నించడానికి కనీసం ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రూముల్లో ఉండి పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వతహాగా మత్స్యకార కుటుంబాలు కావటం తో వీళ్లకు నెల్లూరు చేపల పులుసు అంటే చాల ఇష్టం. ప్రతిరోజు చేపల కూర ఉండాల్సిందే. వీళ్ళ టీం లోని సునీల్ మాష్టర్ “తెలుసు కదా”సినిమాలో డాన్స్ మాస్టరుగా అదరకొట్టాడు.

ఎక్కువమందిని ఎంటర్టైన్ చేయాలి అనే ఉదేశ్యంతో వీళ్ళు సాంగ్స్ ని సెలెక్ట్ చేస్తారు. పాటలో ఎనర్జీ, ఎలేవేషన్ మొదలయిన అంశాలు ఉండేటట్లు కంపోజ్ చేసుకుంటారు. ట్రెండ్ ను ఫాలో అవ్వకుండా పాత పాటలతో ట్రెండ్ ని సెట్ చేసారు.

కే రాంప్ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే :

సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు చూసిన “కే రాంప్” డైరెక్టర్ జైన్స్ నాని వీళ్ళను సంప్రదించాడు. “ఇదేమిటమ్మా మాయా మాయ” పాటను ఆయనే సెలెక్ట్ చేసి ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసుకొని వచ్చి, సినిమాలో డాన్స్ చేయవలసిందిగా కోరాడు. అవకాశాలకోసం ఎదురుచూస్తున్న లుంగీ మామ టీం షూటింగ్ కి వచ్చి, ఆ పాటకు వీళ్ళు కంపోజ్ చేసిన డాన్స్ ను చేసి చూపించారు. కే రాంప్ టీం కు వీళ్ల డాన్స్ నచ్చింది. అంతే, ఎటువంటి మేకప్ లేకుండా , కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు, రోజూ వేసుకొనే కాస్ట్యూమ్స్ తోనే షూటింగ్ చేసేసారు.

ఇటీవల దీపావళికి రిలీజ్ అయిన కే రాంప్ సినిమా అనూహ్యంగా హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం లుంగీ మామ టీం చేసిన ఆ పాట. ఎక్కడ విన్నా ఆ పాటే . చిత్రం అంత ఘన విజయం సాధించినా కే రాంప్ టీం నుండి కేవలం ప్రయాణం ఖర్చులు మాత్రమే లుంగీ మామ టీంకు వచ్చాయి. ఎటువంటి పారితోషకం ఇవ్వలేదు. అయినా అవకాశం రావటమే ఎక్కువని భావించి తమ పని తాము చేసుకుంటున్నారు లుంగీ మామ టీం. చిత్ర పరిశ్రమ అంతే కదా ! ఎటు చూసినా కథలే మామా ..కడ చేరని కధలే మామా ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here