
ఆర్ధికంగా ఉన్నతంగా స్థిరపడిన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆర్ధికంగా నిస్సహాయంగా ఉన్న స్త్రీలకు ఒక అండగా, ఒక కవచంలా ఉండటానికి భరణం ఇవ్వాలని చట్టంలో పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు సమంగా సంపాదిస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సాంఘిక హోదా సమం చేయటానికి భరణం అడగటం అనేది సరికాదు అని కోర్ట్ అభిప్రాయపడింది.
తీర్పులోని ముఖ్యంశాలు :
ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) లో సీనియర్ ఆఫీసర్ గా ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఆమె, అడ్వొకేటుగా ప్రాక్టీస్ చేస్తున్న తన భర్త నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేసులో క్రూరత్వం ఉన్నట్లు గుర్తించిన కోర్ట్ వారికి 2010 లోనే విడాకులు మంజూరు చేసారు. పరస్పర అంగీకారంతో విడాకుల సమయంలో సెటిల్మెంట్ క్రింద భర్త ఆమెకు 50 లక్షల నగదు చెల్లించాడు. విడాకుల అనంతరం ఆమె భర్తనుండి నెల నెలా జీవనభృతి భరణం కోరుతూ మళ్ళీ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తులు అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాధన్ శంకర్ తమ తీర్పును ప్రకటిస్తూ వాస్తవంగా తమను తాము పోషించుకోలేని దుస్థితిలో ఉన్న వ్యక్తులు మాత్రమే భరణం పొందటానికి అర్హులు అని తెలిపారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్ధికంగా వారి దుస్థితిని చట్టం ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్ట్ వారు స్పష్టం చేసారు.
విడాకులు పొందిన వెంటనే ఆటోమేటిక్ గా భరణం వస్తుందని ఎవరయినా అనుకుంటే సరికాదని “భరణం ఒక హక్కు కాదు” అని, ఇద్దరి యొక్క వాస్తవ ఆర్ధిక స్థితిని పరిశీలించి, ఇరువురికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది.
గతంలో పరస్పర అంగీకారంతో 50 లక్షల సెటిల్మెంట్ డిమాండ్ చేసిన భార్యకు, ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కలసి ఉండే ఉద్దేశ్యం లేనందున ఆ మొత్తం డబ్బును భర్త చెల్లించాడు. కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. వీళ్ళు కలసిఉన్నది కేవలం 14 నెలలు మాత్రమే. వీళ్లకు పిల్లలు కూడా లేరు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో విడాకులు మంజూరు చేసినా ఇప్పుడు భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండి, మంచి సంపాదన ఉన్న కారణం చేత ఆమె చేసుకున్న విజ్ఞప్తిని తోసి పుచ్చింది.
ఈ తీర్పు భరణం కొరకు విచ్చలవిడిగా డిమాండ్ చేస్తున్న కొంతమంది మహిళలకు షాక్ అని చెప్పవచ్చు. లగ్జరీల కొరకు, కావాలని కోర్టులకు ఈడ్చి, కోరినంత భరణం పిండుకుందాం అంటే ఇంకా కుదరదు. నిజంగా ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోతే ఆ వివరాలను పరిశీలించి భరణం మంజూరుచేస్తారు కానీ లగ్జరీల కొరకు, విలాసవంతమైన జీవితం కొరకు పీడిస్తామంటే ఇకపై చట్టం వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధించే పరిస్థితి ఉండకపోవచ్చు.