
మద్యం సేవించి వాహనాలను నడిపే వారు తమకేకాక ఇతరులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తారని, కాబట్టి మద్యం సేవించి వాహనాలను నడిపే వాళ్ళను రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సి.సజ్జనార్ తెలిపారు. “మద్యం సేవించి బండి నడిపే వాళ్లకు విచక్షణ ఉండదు. తమ మీద తమకే నియంత్రణ ఉండదు. అందువల్ల వాళ్ళకి, వాళ్ళవల్ల ఇతరులకు ప్రాణ హాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సూసైడ్ బాంబర్ల వలే ప్రమాదకరం. అటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వలన కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రతి పౌరుడు ఒక పోలీసులే. ఒకవేళ ఎవరయినా ఇటువంటి వ్యక్తులను గుర్తిస్తే వారిని గూర్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం పౌరులుగా మీ భాద్యత “అని అన్నారు.
ఇటీవల తాను పోలీస్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరిస్తూ ఈ అత్యుత్తమ వ్యాఖ్యలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో బైకర్స్ మద్యం సేవించినట్లు తేలటంతో ఈ వ్యాఖ్యలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్నూల్ బస్సు దుర్ఘటన తరువాత చాలా మంది సీపీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వం అమ్మితే తప్పు లేనిదీ,తాగితే తప్పేమిటి? అని ప్రజలు భావించేవాళ్లు. కానీ మద్యం అమ్మని దేశం లేదు. ఉదాహరణకు కత్తి అన్ని చోట్లా అమ్ముతారు. దానిని కూరగాయలు తిరగటానికి మంచి పనులకు ఉపయోగించాలి అలా కాదని ఇతరులపై దాడులు చేసేవాళ్లకు జైలు శిక్ష పడుతుంది, తయారు చేసినోడికి లేదా శిక్ష ? అని అడగటం భావ్యం కాదు. మద్యం ఇక్కడ నిషేధిస్తే పక్క రాష్ట్రము వెళతారు ఆలా కాదంటే, ప్రజలే నాటువి, కల్తీవి తయారు చేసి ఇంకా ప్రమాదాలకు కారణమవుతారు. మధ్య నిషేధం అంత సులభమైన పని కాదు. ఇక్కడ మారవలసింది మన ప్రజల మనస్తత్వం..ఆలోచనా విధానం.
కర్నూల్ బస్సు ప్రమాదం లో ఒక తాగుబోతు చేసిన తప్పుకు చిన్నపిల్లలతో సహా 20 మంది సజీవ దహనం అయ్యారు. ఇకపై తాగి వాహనాలు నడిపే వాళ్ళకి ఫైన్ కాదు, సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు జైలుశిక్ష వెయ్యాలి. సజ్జనార్ గారు చెప్పిన వ్యాఖ్యలు నిజమే. వాళ్ళని ట్రాఫిక్ తీవ్రవాదులుగా పరిగణించాల్సిందే.